అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.
వసు: - సర్వ భూతములయందు వశించువాడు.
వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.
సత్య: - సత్య స్వరూపుడు.
సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.
సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.
సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.
అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.
పుండరీకాక్ష: - భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.
వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.
వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.
రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.
బహుశిరా: - అనేక శిరములు కలవాడు.
బభ్రు: - లోకములను భరించువాడు.
విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
శుచిశ్రవా: - శుభప్రథమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
అమృత: - మరణము లేనివాడు.
శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.
వరారోహ: - జ్ఞానగమ్యమైనవాడు.
మహాతపా: - మహాద్భుత జ్ఞానము కలవాడు.
సర్వగ: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
సర్వవిద్భాను: - సర్వము తెలిసినవాడు.
విష్వక్సేన: - అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్ధమునకు ఉపక్రమించినంతనే అసురసేన యంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విష్వక్సేను డాయెను.
జనార్దన: - దు:ఖమును తొలగించువాడు. ఆనందము నొసగూర్చువాడు.
వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.
వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు.
అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.
వేదాంగ: - వేదములనే అంగములుగా కలిగినవాడు.
వేదవిత్ - వేదములను విచారించువాడు.
కవి: - సర్వద్రష్ట యైనవాడు.
లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు.
సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.
ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు.
కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు.
చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.
చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు.
చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.
చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.
భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.
భోజన: - భోజ్యరూపమైనవాడు.
భోక్తా: - ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు.
సహిష్ణు: - భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.
జగదాదిజ: - సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు.
అనఘ: - పాపరహితుడైనవాడు.
విజయ: - ఆత్మజ్ఞానముతో వైరాగ్యసంపన్నుడై, శ్రేష్టమైన జయమునొందువాడు.
జేతా: - సదాజయము నొందువాడు.
విశ్వయోని: - విశ్వమునకు కారణభూతమైనవాడు.
పునర్వసు: - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.
ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.
వామన: - చక్కగా సేవించదగినవాడు.
ప్రాంశు: - ఉన్నతమైన శరీరము గలవాడు.
అమోఘ: - వ్యర్ధము కాని పనులు గలవాడు.
- తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు.
ఊర్జిత: - మహా బలవంతుడు.
అతీంద్ర: - ఇంద్రుని అతిక్రమించినవాడు.
సంగ్రహ: - ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు.
సర్గ: - సృష్టియు, సృష్టికారణమును అయినవాడు.
ధృతాత్మా - తనపై తాను ఆధారపడినవాడు.
నియమ: - జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు.
యమ: - లోపలనుండి నడిపించువాడు.
వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.
వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.
సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.
వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.
మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.
మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.
అతీంద్రయ: - ఇంద్రియములద్వారా గ్రహించుటకు వీలులేనివాడు.
మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.
మహోత్సాహ: - ఉత్సాహవంతుడు.
మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు.
మహాబుద్ధి: - బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు.
మహావీర్య: - బ్రహ్మాండములను సృష్టించి, పోషించి, లయింపచేయు శక్తిసామర్ధ్యములు కలిగియున్నవాడు.
మహాశక్తి: - మహిమాన్విత శక్తిపరుడైనవాడు.
మహాద్యుతి: - గొప్ప ప్రకాశము అయినవాడు.
అనిర్దేశ్యవపు: - నిర్దేశించుటకు, నిర్ణయించుటకు వీలుకానివాడు.
శ్రీమాన్ - శుభప్రదుడు.
అమేయాత్మా - ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు.
మహాద్రిధృక్ - మందర, గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు.
మహేష్వాస: - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
మహీభర్తా: - భూదేవికి భర్తయై, రక్షకుడైనవాడు.
శ్రీనివాస: - శ్రీమహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు.
సతాంగతి: - సత్పురుషులకు పరమగతి అయినవాడు.
అనిరుద్ధ: - మరొకరు ఎదురించువారు లేనివాడు.
సురానంద: - దేవతలకు ఆనందము నొసంగువాడు.
గోవింద: - గోవులను రక్షించువాడు.
గోవిదాం పతి: - వాగ్విదులు, వేదవిదులైనవారికి ప్రభువైనవాడు.
మరీచి: - తేజోవంతులలో తేజోవంతుడైనవాడు.
దమన: - తమకప్పగించబడిన బాధ్యతలనుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు.
హంస: - నేను అతడే (అహం బ్రహ్మస్మి)
సుపర్ణ: - అందమైన రెక్కలు గలవాడు.
భుజగోత్తమ: - భుజంగములలో ఉత్తముడు.
హిరణ్యగర్భ: - బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు.
సుతపా: - చక్కటి తపమాచరించువాడు.
పద్మనాభ: - హృదయపద్మమధ్యమున భాసించువాడు.
ప్రజాపతి: - అనంతజీవకోటికి ప్రభువైనవాడు.
అమృత్యు: - మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.
సర్వదృక్ - తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది, చేయునది అంతయు చూచుచుండువాడు.
No comments:
Post a Comment